Vahini Current Issue : Feb 2025
సంపాదకీయం
వాహిని ప్రియ పాఠక మహాశయులందరికి సంపాదకీయ కార్యవర్గ సభ్యుల ప్రణామములు. మాఘ మాసంలో ఫిబ్రవరి వాహిని మాసపత్రిక పాఠకులందరికీ, సవినయ నమస్సులతో, పఠనానికై ఆహ్వానిస్తున్నాము.
‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించి.. క్రతువులు నిర్వహించే వారు కనుక ఈ మాసం మాఘమాసమైంది. మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది.
మాఘమాసంలో ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం.
మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు.
వాహిని పాఠకులకు సాంకేతిక పరిజ్ఞానం మేళవిస్తూ, ప్రాంతీయ తెలుగుతనాన్ని ప్రోత్సహిస్తూ మేము మీకు అందిస్తున్న ఈ సంచిక మీకు నచ్చుతుందని ఆకాంక్షిస్తున్నాము.
ఈ సంచిక సంపాదకీయంలో మాకు సహకరించి, వాహిని మాసపత్రికకు రచనలు అందచేసిన రచయితలకు, అలాగే ప్రకటన కర్తలకు, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికి ధన్యవాదాలు. తెలుగు సంస్కృతి, సాహిత్యంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ, వాహిని లో మన తెలుగు వారికి అందించాలనే ఒక తపనతో చేసిన ఈ ప్రయత్నాన్ని సహకరిస్తారని ఆకాంక్షిస్తూ....
మీ శ్రేయోభిలాషులు,
శ్రీనివాస్ గోవర్ధనం